"మిలిటరీ గ్రామం: మిలిటరీ మాధవరం కథ "



మిలిటరీ గ్రామం: మిలిటరీ మాధవరం కథ

ఊరి పేరు మిలటరీ మాధవరం. ఇల్లు లేకుండా ఇంటికొక సైనికుడు ఉండే గ్రామం ఇది. ఉగ్గుపాలతోనే దేశభక్తిని నూరిపోసే తల్లుల త్యాగాల వల్లే ఈ గ్రామం ఇలా రూపుదిద్దుకుంది. పాకిస్తాన్‌తో భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో, ప్రతి భారతీయ పౌరుడు సైనికులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు.

సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని నిలబడే సైనికుల వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. వాళ్ల విరాట శౌర్యం లేకపోతే విదేశీ శక్తులు మన దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఉగ్రవాదులు స్వేచ్ఛగా విహరించే పరిస్థితి ఏర్పడేదీ. అందుకే “జై జవాన్” అంటూ సైనికులకు గౌరవం తెలపడం మన కర్తవ్యం.

ఇలాంటి సమయంలో ఒక ఊరిలో ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉండడమనేది ఆశ్చర్యకరమైన విషయమే. ఇది కేవలం ఉపాధి కాదు – ఇది త్యాగానికి, దేశసేవకు అంకితమైన పయనం. అటువంటి దేశభక్తిని తల్లులు తమ పిల్లలలో చిన్ననాటి నుంచే నూరిపోస్తున్నారు. అలాంటి ఊరే మిలటరీ మాధవరం.

ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో ఉంది. దేశంలోని త్రివిధ దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను అందించిన ఈ గ్రామం, “మిలటరీ మాధవరం”గా పేరు పొందింది. ఈ మట్టిలోనే పోరాట స్ఫూర్తి ఉంది. ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఈ గ్రామం నుంచి సుమారు 2000 మంది పాల్గొన్నారు.

ప్రస్తుతం కూడా సరిహద్దుల్లో సుమారు 500 మంది ఈ గ్రామానికి చెందిన సైనికులు సేవలందిస్తున్నారు. ఈ ఊరి సైనిక చరిత్ర 1915లో మొదటి ప్రపంచ యుద్ధం నుంచే మొదలైంది. అప్పట్లో సుమారు 90 మంది పోరాటంలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో 1100 మంది ఈ గ్రామం నుంచి యుద్ధానికి వెళ్లారు.

1962 చైనా యుద్ధంలో 850 మంది, 1965 పాకిస్థాన్ యుద్ధంలో 900 మంది, 1971లో 950 మంది ఈ గ్రామానికి చెందిన సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఎందరో మాజీ సైనికులు (ఎక్స్ సర్వీస్ మెన్) నివాసం ఉంటున్నారు. అవసరమైతే మళ్లీ యుద్ధానికి సిద్ధమనే జిజ్ఞాస వీరిలో ఇప్పటికీ ఉంది.

మిలటరీ గ్రామం – మాధవరం,
తాడేపల్లిగూడెం మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా,