Indian Army Salaries: కొన్ని వారాలుగా పాకిస్థాన్‌తో భారత సాయుధ బలగాలు తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నాయి. అలుపెరగకుండా దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్న భారత సైన్యం సేవలు ఎంత ప్రశంసించినా తక్కువే. మరి దేశం కోసం అంత కష్టపడుతున్న భారత సైన్యంలో పని చేస్తున్న సైనికులతోపాటు వివిధ స్థాయిలో ఉండే ఉద్యోగులు, అధికారుల జీతాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ప్రాథమిక వేతనం ఎంత? జీతాల పెరుగుదల ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకుందాం.
పహల్గమ్ ఉగ్రవాద సంఘటన అనంతరం భారతదేశం ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సందర్భంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. దీంతో ప్రపంచానికి భారత సైనిక శక్తి.. బలం ఏమిటో తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక దళాలల్లో భారతదేశం కూడా ఒకటి. టాప్ 5లో భారత్ ఉంటుంది. సరిహద్దులో కాపు కాసే జవాన్‌తోపాటు ఆర్మీలో అత్యున్నత పదవి కలిగిన అధికారి వరకు వారి జీతాలు ఇతర ఉద్యోగులతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. భారత సైన్యంలో ఉన్న వారి జీతాలు 2024 లెక్కల ప్రకారం ఇలా ఉంటాయని తెలుస్తోంది.
ర్యాంకుల వారీగా సైన్యంలో వివిధ స్థాయిల్లో జీతాలు ఉంటాయి. ఆర్మీలో మొదటి ఉద్యోగి సైనికుడు. సైన్యంలో కీలక పాత్ర పోషించే సైనికుడికి రూ.25,0000 జీతం ఉంటుంది. సైనికుడి తర్వాత ల్యాన్స్ నాయక్ అనే పోస్టుకు రూ.30 వేలు ఉంటుందని తెలుస్తోంది. నాయక్ రూ.35 వేలు ఉండగా.. హవల్డార్ రూ.40 వేలు ఉంటుందని చెప్పవచ్చు. నాయబ్ సుబేదార్ రూ.45 వేలు, సుబేదార్ రూ.50 వేలు, సుబేదార్ మేజర్ రూ.65 వేలు వేతనంగా ఉంటుందని అంచనా. లెఫ్టినెంట్ రూ.68 వేలు, కెప్టెన్ రూ.75,000 ఉంటుందని సుమారుగా భావించవచ్చు.
ఇక ఆర్మీలో అత్యున్నత పదవుల్లో ఉండే వారి జీతాల వివరాలు ఇలా ఉన్నాయి. మేజర్ రూ.లక్ష వేతనంగా ఉంటుందని.. లెఫ్టినెంట్ కల్నల్ రూ.1,12,00 ఉంటుందని అంచనా. కల్నల్ రూ.1,30,000, బ్రిగేడియర్ రూ.1,39,000 నుంచి రూ.2,27,00 వరకు ఉంటుందని తెలుస్తోంది. మేజర్ జనరల్ రూ.1,44,000 నుంచి రూ.2,188,200 వరకు ఉంటుందని భావించవచ్చు. ఆర్మీ టాప్ 2 పదవిలో ఉండే లెఫ్టినెంట్ జనరల్ రూ.1,82,200 నుంచి రూ.2,24,100 ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇక ఆర్మీలో అత్యున్నత పదవి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌లో ఉన్న అధికారికి రూ.2,50,000 ఉంటుందని తెలుస్తోంది
ఇక వేతనాలతోపాటు ఆర్మీలో ఉన్న వారికి మరికొన్ని అదనపు ప్రయోజనాలు దక్కుతాయి. సాధారణ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ (కరువు భత్యం), మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) వంటి ప్రయోజనాలు ఆర్మీ వారికి లభిస్తాయి. వీటితోపాటు రవాణా భత్యం (టీఏ), ఫీల్డ్ ఏరియా అలవెన్స్, హై అల్టిట్యూడ్ అలవెన్స్, స్పెషల్ డ్యూటీ అలవెన్స్ వంటి భత్యాలు అందుతాయి. ఇక వైద్య సౌకర్యాలు అదనం. ఆర్మీ నుంచి పదవి విరమణ పొందిన వారికి పింఛన్‌తోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని లభిస్తాయి.
గమనిక: భారత ఆర్మీకి సంబంధించిన విషయాలు భద్రతా కారణాల రీత్యా బయటకు తెలియవు. పైన తెలిపిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించినవి